ఈ మధ్య ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా చేయడం చాలా ఎక్కువైంది. దాంతో డెలివరీ సమయంలో సౌలభ్యంగా ఉన్నా, తర్వాతర్వాత మహిళలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ సంఖ్యలో మహిళల గర్భ సంచి తీయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో మహిళలు చాలా బలహీనంగా మారతారు. వీటన్నింటికీ చెక్ పెట్టి, మళ్లీ సహజ ప్రసవాలను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. సాధారణంగా ప్రసవ సమయంలో వచ్చే నొప్పులను తట్టుకోలేక చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆపరేషన్లకు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ప్రభుత్వం నొప్పులు లేకుండా ప్రసవం అయ్యేలా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
కొత్తగా నార్మల్ డెలివరీ ఎలా చేస్తారంటే.. ప్రసవ సమయంలో నెట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిశ్రమాన్ని గర్భిణీలకు ఇస్తారు. దీన్ని పీల్చిన తర్వాత 15 నుంచి 20 సెకండ్లలో పని చేయడం ప్రారంభిస్తుంది. దీని ప్రభావం ఐదు నిమిషాల వరకు ఉంటుంది. నొప్పులు వచ్చినప్పుడల్లా ఈ వాయువును పీలిస్తే సరిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మత్తు లేదా పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా తల్లికి, బిడ్డకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాదులోని కింగ్ కోఠి ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇందుకు అవసరమయ్యే పరికరాలు, గ్యాస్ సిలిండర్లను సిద్ధంగా ఉంచింది. ఇక్కడ సక్సెస్ అయితే అంతటా అమలు చేయాలని భావిస్తోంది.