టీచర్ల ఆస్తులపై వెనక్కి తగ్గిన సర్కార్.. ఉత్తర్వుల ఉపసంహరణ - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్ల ఆస్తులపై వెనక్కి తగ్గిన సర్కార్.. ఉత్తర్వుల ఉపసంహరణ

June 26, 2022

తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడి అంశంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తుల వెల్లడిపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఏదైనా భూములు క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఏటా తాము ఆదాయపన్ను శాఖకు వివరాలను ఇస్తున్నామని, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నించారు. వీరితో పాటు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాయి. ముందుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులను ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించాలని, అవి ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ కూడా విమర్శించారు. దీంతో పరిస్థితిని గమనించిన ప్రభుత్వం.. కొన్ని గంటల వ్యవధిలోనే సదరు ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ అంశంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.