రథసారథులకు తెలంగాణ సర్కార్ తీపికబురు - MicTv.in - Telugu News
mictv telugu

రథసారథులకు తెలంగాణ సర్కార్ తీపికబురు

April 26, 2022

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులుకు తీపికబురు చెప్పింది. ఎంతో కాలంగా కరువు భత్యం విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలకు, నిరసనలకు, ఆందోళనకు ఫలితం దక్కింది. సోమవారం కేసీఆర్.. సామాన్యుడి రథసారథులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, కరువు భత్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచే ఈ భత్యం అందుకునేలా ఆదేశాలు జారీ చేశారు. 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదుశాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామికులకు, యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ. 600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది.

అంతేకాకుండా, వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ రావడంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. దీంతో డీఏల చెల్లింపు ఆగిపోయింది. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తించనుందని అధికారులు తెలిపారు.

మరోపక్క ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ పెంపుపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం కరువు భత్యానికి సంబంధించి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.