టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తీవ్రంగా వాదించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ పిటిషన్ వేయగా, దానిపై వాడివేడి వాదనలు జరిగాయి. బీజేపీ తరపున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ కేసీఆర్ కనుసన్నల్లో నడిచే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోర్టును కోరారు.
అటు సిట్ తరపున దుష్యంత్ దవే వాదిస్తూ ఇదొక తీవ్రమైన నేరమన్నారు. నిందితులతో మాకు సంబంధం లేదంటారు మళ్లీ వారి తరపునే పిటిషన్లు వేస్తారని ఎద్దేవా చేశారు. అనేక చోట్ల ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందని, ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది. ఇక దీనికంటే ముందు ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, కోర్టు విచారణను గురువారం (రేపు) వాయిదా వేసింది.