The ticket was not given because he came in a lungi..what happened after that..
mictv telugu

లుంగీలో వచ్చాడని టికెట్ ఇవ్వలేదు..ఆ తర్వాత ఏం జరిగిదంటే..

August 6, 2022

లుంగీ కట్టుకొని సినిమా చూడటానికి వచ్చాడని ఓ సినిమా థియేటర్ యాజమాన్యం అతడికి టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆ వ్యక్తి ‘ఇలా సినిమా థియేటర్‌కు రావటం తప్పా?’ అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. దానికి ఆ యాజమాన్యం ఏవేవో సమాధానాలు చెప్తూ, అతడిని హాల్ నుంచి బయటికి పంపించేసింది. వెంటనే ఆ వ్యక్తి థియేటర్ యాజమాన్యం తన పట్ల ప్రవర్తించిన తీరుపై ఓ వీడియోను చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోను వీక్షించిన సినిమా ప్రియులంతా.. అతడికి మద్దతు తెలుపుతూ, అన్నీ సినిమా థియేటర్లలోకి వెళ్లి లుంగీలు కట్టుకొని నిరసనలు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ ‘స్టార్ సినీ ప్లెక్స్‌’లో సినిమాను చూడడానికి సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి బుధవారం లుంగీని ధరించి థియేటర్‌కు వెళ్లాడు. దాంతో థియేటర్ యాజమాన్యం తనకు టికెట్ ఇవ్వమని నిరాకరించింది. దాంతో ఆ వ్యక్తి ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ..’నేను ఢాకాలోని స్టార్ సినీ ప్లెక్స్ థియేటర్‌లో ‘పోరన్’ సినిమాను చూసేందుకు వెళ్లాను. లుంగీ ధరించానన్న కారణంతో నాకు టికెట్ ఇవ్వలేదు. లుంగీతో సినిమాను చూడొద్దా?, ఇది పెద్ద తప్పా?” అని ప్రశ్నించాడు.

ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో యాజమాన్యం స్పందించింది. ‘వస్త్రధారణ ఆధారంగా వినియోగదారుల పట్ల మేము ఎలాంటి వివక్ష చూపడం లేదు’ అని వెల్లడించింది. సంబంధిత వ్యక్తి అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, జరిగిన దానికి చింతిస్తున్నామని పేర్కొంది. అనంతరం థియేటర్ యాజమాన్యం..సర్కార్ ఆలీతోపాటు ఆయన కుటుంబాన్ని అదే మల్టీ ప్లెక్స్‌లో సినిమా చూడటానికి ఆహ్వానించింది. అయితే, ‘పోరన్’ నటుల్లో ఒకరైన సరిఫుల్ రాజ్ కూడా వారితో కలిసి సినిమా చూడటం సంచలనంగా మారింది.