మందు తాగుతున్న మందుబాబును లాక్కెళ్లిన పులి సగం తినేసిన షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. రామ్ నగర్ అడవిలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 32 ఏళ్ల నఫీస్ అనే వ్యక్తి పులికి ఆహారమైపోయాడు. నఫీస్ ని ఖతారి గ్రామనివాసిగా గుర్తించారు. సాయంకాలం నఫీస్ స్నేహితులతో కలిసి ఊరిబయటకు వెళ్లి కాలువ బ్రిడ్జి పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా వచ్చిన ఓ పులి నఫీస్ ని నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. ఇది చూసిన స్నేహితులు భయంతో పారిపోయి పోలీసులకు సమాచారమందించారు. దాంతో ఘటనా స్థిలికి చేరుకున్న పోలీసులు నఫీస్ కోసం గాలింపు మొదలుపెట్టారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం నఫీస్ దేహ సగభాగం దొరికింది. మిగిలిన సగ భాగాన్ని పులి తినేసింది. కాగా, ఇది టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో పులులు తరచూ సంచరిస్తుంటాయని పోలీసుల వెల్లడించారు. గ్రామస్థులు అడవి సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.