The Tourism Department has given permission for the Papikondala Yatra
mictv telugu

పాపికొండల యాత్రకు పర్యాటక శాఖ అనుమతి.. త్వరలో ప్రారంభం

November 6, 2022

ప్రకృతి అందాలతో కూడుకున్న పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతి ఇచ్చింది. గోదావరి నదికి వరదలు తగ్గడంతో యాత్రను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచనుంది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు ఏర్పడిన భారీ వరదల వల్ల పాపికొండల యాత్ర మూడు నెలలు నిలిచిపోగా.. ఇప్పుడు నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్ర ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు.

గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటు చేశారు. పోచమ్మ గండి ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. కాగా, గతంలో పాపికొండల యాత్రను ఈ సమయానికి నిలిపివేసేవారు. నదిలో నీటిమట్టం తగ్గడంతో పాటు ఇసుక దిబ్బలకు బోట్లు తగిలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండేది. కానీ, ఇప్పుడు పోలవరం వద్ద ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో వేసవి కాలంలోనూ బోటు షికారును కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, 2019లో దేవీ పట్నం మండలం కచ్చలూరు వద్ద బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన నేపథ్యంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.