సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కానీ రైల్వే శాఖ ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు. మొత్తం 8 రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే.. అందులో 3 రూట్లు ఏపీ నుంచి మహారాష్ట్రకు ఉన్నాయి. సంక్రాంతి.. తెలుగు వారి పెద్ద పండుగ కాబట్టి కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై నగరాల్లో ఉండే తెలుగు వారు పెద్దసంఖ్యలో వచ్చి వెళతారు. తాజా జాబితాలో చెన్నై, బెంగళూరుల నుంచి ఒక్క ప్రత్యేక రైలూ లేదు. అది మాత్రమే కాదు.. హైదరాబాద్ నుంచి అత్యధిక రద్దీ ఉండే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఒక్క స్పెషల్ ట్రైన్ ప్రకటించలేదు దక్షిణ మధ్య రైల్వే.
ఉమ్మడి ప్రకాశం..రాయలసీమ జిల్లాలకూ తాజా జాబితాలో లేవు. హైదరాబాద్ నుంచి ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో వెళతారు. జనసాధారణ్ రైళ్లు కావాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉన్నా వాటి ప్రస్తావన లేదు. రద్దీ ఒకలా ఉంటే .. రైళ్లు మరోలా ఉన్నాయి. సంక్రాంతి రద్దీ జనవరి 11-13 తేదీల్లో భారీగా ఉంటుంది. కానీ ద.మ.రైల్వే.. ప్రత్యేక రైళ్లను జనవరి 1, 2, 3, 4 5, 6, 7 తేదీల్లో ప్రకటించింది. జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయాక 16, 17, 18 తేదీల్లో వెళ్లే రైళ్లను సంక్రాంతి జాబితాలో చేర్చింది. మచిలీపట్నం నుంచి కర్నూలుకు జనవరి 3, 5, 7, 10, 12, 14, 17.. లింగంపల్లి నుంచి కాకినాడకు 3, 5, 7, 10, 12, 14, 17, 19.. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం 1, 8, 15 తేదీల్ల్లో ప్రత్యేక రైళ్లున్నాయి.