The villagers fined the young woman who drove the tractor
mictv telugu

ట్రాక్టర్‌తో పొలం దున్నినందుకు యువతి గ్రామ బహిష్కరణ

August 5, 2022

పురుషులతో సమానంగా కష్టపడుతున్న ఆధునిక మహిళల కాలం ఇది. విద్యా, ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే దేశంలో ఇంకా కొన్ని చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వారిపై వివక్ష కొనసాగుతోంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఓవైపు దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుండగా, దాని ఫలాలు ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదని జార్ఖండ్‌లో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తోంది. ట్రాక్టరుతో పొలం దున్నినందుకు గ్రామస్థులు ఓ యువతిని గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. అందుకు మూఢనమ్మకాలే కారణమవడం దురదృష్టకరం. వివరాల్లోకెళితే.. గుమ్లా జిల్లా దహుటోలీ గ్రామానికి చెందని మంజు ఒరాన్ అనే యువతి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రైతులు కాగా, వారికి ఆరెకరాల పొలం ఉంది. రెండేళ్ల క్రితం సమీపంలోని 10 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని అందులో బంగాళా దుంపలు, మొక్కజొన్న, వరి, టమాటా వంటి పంటలు సాగుచేయగా మంచి ఆదాయం వచ్చింది.

దాంతో ఈ ఏడు ఓ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కున్నారు. మంజు స్వయంగా ఆ ట్రాక్టరుతో పొలం దున్నడం మొదలెట్టింది. దీంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన లేని ఆ గ్రామస్తులు మంజు చేసిన పనికి అభ్యంతర పెట్టారు. ఆడపిల్ల పొలం దున్నడమేంటని, దీని వల్ల గ్రామానికి అరిష్టం చుట్టుకుంటుందని గగ్గోలు పెట్టారు. అంతేకాక, కరువు కాటకాలు సంభవిస్తాయని, అంటువ్యాధులు ప్రబలుతాయని ముక్తకంఠంతో వాదించారు. ట్రాక్టరుతో పొలం దున్నినందుకు గాను క్షమాపణలు చెప్పడంతో పాటు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. లేకుంటే సాంఘిక బహిష్కరణ చేస్తామని బెదిరించారు. అయితే దీనికి ఒప్పుకోని మంజు ఆ ఆదేశాలను ప్రతిఘటించింది. ఎవరెన్ని చెప్పినా ప్రగతిశీల రైతుగా ఉంటానే తప్ప వ్యతిరేకంగా తీర్పునిచ్చిన వారికి బెదిరేది లేదని కరాఖండీగా చెప్తోంది.