ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరుగగా, స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజినీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో 13,14,15 గేట్లను ఎత్తి ప్రాజెక్టులోనీటి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవగా, ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా గేట్ల నిర్వహణ, మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నానికే అర టీఎంసీ నీరు వృథాగా దిగువకు వెళ్లిపోయాయి. దీంతో తక్షణం దెబ్బతిన్న గేటు మరమ్మత్తుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కాగా, తెలంగాణలోని మూసీ నదిపై ఉన్న ప్రాజెక్టు గేటు కూడా ఆ మధ్య ఊడిపోవడంతో భారీ స్థాయితో నీరు వృథా అయింది.