భర్త బతికుండగా వైధవ్యం.. వరుస చావులతో వణికిపోతున్న ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

భర్త బతికుండగా వైధవ్యం.. వరుస చావులతో వణికిపోతున్న ప్రజలు

May 30, 2022

దీన్ని మూఢనమ్మకం అంటారో లేక మరైదైనా అంటారో కానీ, ఓ వివాహిత చేసిన పనికి ఆ ఊరి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివాహిత వల్లే గ్రామంలో వరుస చావులు జరుగుతున్నాయంటూ ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. వివరాలు.. అనంతపురం గుత్తి మండలానికి చెందిన పి. ఎర్రగుడి గ్రామంలో జరిగిన ఘటన ఇది. ఓ మహిళ భర్త అలవాట్ల కారణంగా ఆయన బతికుండగానే విధవరాలిగా మారింది. అప్పట్నుంచి ఆ ఊరిలో ఎనిమిది మరణాలు సంభవించాయి. మరణాలన్నీ 23వ తేదీనే జరుగుతుండడం, మరణాలకు కారణాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఓ పూజారిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. పూజారి మహిళ వల్లనే ఇదంతా జరుగుతోందని, గ్రామానికి అరిష్టం పట్టుకుందని చెప్పడంతో ప్రజలు కూడా గాఢంగా నమ్మారు. దీంతో సదరు మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, ఆమె మొండికేసింది. ఇంకా బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. మహిళ కారణంగానే గ్రామానికి చెడు జరుగుతోందని, తమను కాపాడాలని పోలీసులకు మొర పెట్టుకున్నారు. ఎలాగైనా మహిళను నచ్చజెప్పాలనే ఊరి ప్రజల విన్నపంతో పోలీసులు గ్రామంలోకి ఎంటరయ్యారు. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి వైధవ్యాన్ని విరమింపజేశారు. కాగా, మరణాలు సంభవిస్తే దానికి కారణం గురించి వైద్యులను సంప్రదించి తెలసుకోవాలి అంతేకానీ, మహిళే కారణమని భావించడం తగదని పోలీసులు గ్రామస్తులకు సూచించారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో మూఢనమ్మకాలను వదిలేయాలని కోరారు.