భర్తకు ఊపిరినిచ్చి ప్రాణాలు కాపాడిన భార్య - MicTv.in - Telugu News
mictv telugu

భర్తకు ఊపిరినిచ్చి ప్రాణాలు కాపాడిన భార్య

October 2, 2022

గుండెపోటుతో ఊపిరాడక ప్రాణాలొదిలే పరిస్థితికి చేరిన భర్తను భార్య తన నోటి ద్వారా గాలి ఊది ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురా నగరంలో జరిగింది. వివరాలు.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన కేశవన్ (67) తన భార్య దయాతో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి కొజికోడ్ వెళ్తుండగా, యూపీలోని మథురా స్టేషన్ సమీపంలో గుండె పోటు వచ్చింది. వెంటనే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కేశవన్‌ను పడుకోబెట్టి రైల్వే పోలీసులకు సమాచారమందించారు. దీంతో కేశవన్‌ను చేరుకున్న కానిస్టేబుల్ అశోక్ కుమార్ వెంటనే సీపీఆర్ (నోటితో గాలి ఊది ఊపిరి అందించడం) చేయాలని దయాకు సూచించగా, 33 సెకన్ల పాటు భార్య నోటి ద్వారా గాలి ఊది ప్రాణాపాయం తప్పించింది. అనంతరం అంబులెన్స్‌లో రైల్వే ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటుండగా, సమయానికి సీపీఆర్ చేసేలా ప్రోత్సహించిన కానిస్టేబుల్‌కు దయా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.