భర్తను చంపడమెలా? అనే బుక్కు రాసి.. ఏడేళ్లకు అమలు చేసిన భార్య - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను చంపడమెలా? అనే బుక్కు రాసి.. ఏడేళ్లకు అమలు చేసిన భార్య

May 27, 2022

అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ 2011లో భర్తను ఎలా చంపాలి అనే పుస్తకాన్ని రాసి ప్రచురించింది. అందులోని అంశాలను చదివి ఎవరైనా తమ భర్తలను చంపారో లేదో తెలియదు కానీ, రాసిన రచయిత్రి నాన్సీ మాత్రం సరిగ్గా పాటించింది. పుస్తకం ప్రచురించిన ఏడేళ్ల తర్వాత తన భర్తను నాన్సీ చంపేసింది. దాంతో కోర్టు నాన్సీని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆసక్తికరంగా ఉన్న ఈ సంఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి. నాన్సీ అనే రచయిత్రి వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు.

ఆమె తన భర్త డానియేల్‌తో హాయిగా కాపురం చేస్తోంది. ఈ క్రమంలో రచయిత్రి అయిన నాన్సీ 2011లో భర్తను ఎలా చంపాలి అనే పుస్తకాన్ని రాసి ప్రచురించింది. కానీ, ఆ సమయంలో తనకు తెలియదు కాబోలు.. తాను తన భర్తను చంపుతానని. ఆఫీసులో పనిచేస్తున్న నాన్సీ భర్త డానియేల్ 2018 జూన్‌లో ఆఫీసులోనే మరణించారు. పోలీసులు పరిశీలించి చూడగా ఆయన ఛాతీలో రెండు బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. తర్వాత విచారణను తీవ్రతరం చేసిన పోలీసులు ఆ హత్యలో నాన్సీ పాత్ర ఉన్నట్టు గుర్తించారు. డానియేల్ హత్య జరిగిన రోజు నాన్సీ భర్త ఆఫీసుకు వచ్చినట్టు ఆధారాలుండడంతో పోలీసులు నాన్సీని అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి నాన్సీ జైల్లోనే ఉండగా, తాజాగా కోర్టు తుది తీర్పు ఇచ్చింది. డానియేల్‌ను హత్య చేసింది నాన్సీనే అని స్పష్టం కావడంతో కోర్టు శిక్ష విధించింది. కాగా, తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను హత్య చేసినట్టు నాన్సీ విచారణలో ఒప్పుకుంది.