The woman, who was told by the CBI that she was dead, appeared in court.
mictv telugu

సీబీఐ చంపేసిన సాక్షి కోర్టులో ప్రత్యక్షం.. షాకయిన జడ్జీ

June 4, 2022

The woman, who was told by the CBI that she was dead, appeared in court.

హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఓ మహిళ చనిపోయిందని సీబీఐ ధృవీకరించగా, అకస్మాత్తుగా విచారణ సమయంలో సదరు మహిళ కోర్టులో ప్రత్యక్షమయింది. దీంతో సీబీఐ సహా, జడ్జీలు కూడా షాకయ్యారు. సినిమాలో ఉన్నట్టున్న ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముజఫర్‌పూర్‌ నగరంలో 2016లో జర్నలిస్ట్ అయిన రాజ్ దేవ్ రంజన్ అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా, ఐదుగురు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు.

దీంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా, అదే ఏడాది సెప్టెంబర్ 15న కేసు నమోదైంది. కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన బాదామీ దేవీ అనే మహిళను విచారించడానికి సీబీఐ కోర్టు అనుమతి తీసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ, గత నెల బాదామీ దేవీ చనిపోయినట్టు సీబీఐ మే 24న కోర్టుకు నివేదిక సమర్పించింది. అంతలో సీబీఐకి షాకిస్తూ బాదామీ దేవీ కోర్టులో ప్రత్యక్షమయింది. ‘నన్ను సీబీఐ వాళ్లు ఎవరూ కలవలేదు. హత్య కేసులో నేను ప్రత్యక్ష సాక్షిని. నేను చనిపోయినట్టు సీబీఐ వాళ్లు చెప్పినట్టు పత్రికలలో రావడంతో ఇలా మీ ముందుకు వచ్చాను. కేసును తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ముందు చెప్పింది. ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ‘దర్యాప్తు సంస్థ చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. వేరే వ్యక్తులతో కుమ్మక్కై సీబీఐ ఈ పని చేసిందని నేను నమ్ముతున్నాను. అమాయకులను ఈ కేసులో ఇరికించడానికి సీబీఐ చాలా పెద్ద నాటకం ఆడుతోందని నా అభిప్రాయం’ అని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి తప్పుడు అఫిడవిట్ సమర్పించిన సీబీఐకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.