ప్రపంచ పెద్దమ్మ ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచ పెద్దమ్మ ఇకలేరు

April 26, 2022

ప్రపంచ పెద్దమ్మగా పేరుగాంచిన కానే రనాకా ఇకలేరు. ఆమె ఈనెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించిన కానే రనాకా 119వ ఏట కన్నుమూశారు. నైరుతి జపాన్లోని ఫుకోకా పట్టణానికి చెందిన ఆమె ఈనెల 19న తుదిశ్వాస విడిచినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

2019 మార్చి నెలలో గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది. అప్పటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే, 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా కానే రికార్డు సృష్టించారు. అప్పటికి ఆమె వయసు 117 సంవత్సరాల 261 రోజులు. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం బతికిన రెండో వ్యక్తిగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన 1903వ సంవత్సరంలో జనవరి రెండో తేదీన కానే జన్మించారు.

1922లో 19వ ఏట హిడియో రనాకా అనే వ్యక్తిని పెళ్లాడారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు. 1937లో రెండో చైనా-జపాన్ యుద్ధంలో పాల్గొనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో కానే నూడుల్స్ దుకాణం నడిపారు. సోడా, చాక్లెట్ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని కానే చెప్పేవారు. ఈనాకా మృతితో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఫ్రాన్స్ మహిళ లుసిలీ రాండన్ నిలిచారు. ఆమె వయసు 118 సంవత్సరాల 73 రోజులు.

మరోపక్క జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాలపై, జీవన శైలిపై పరిశోధనలూ జరుగుతున్నాయి.