The world's richest people have suffered huge losses
mictv telugu

బిలీయనీర్స్‌కి బ్యాడ్ డే.. ఒకేరోజు లక్షల కోట్ల నష్టం

September 14, 2022

స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెడితే ఎంత స్పీడుగా లాభాలు వస్తాయో అంతే స్పీడుతో నష్టాలు కూడా వస్తాయి. ఒక్కోసారి అనూహ్యరీతిలో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. దీనికి సామాన్యులతో పాటు అపర కుబేరులు కూడా అతీతం కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మంగళవారం అమెరికా సంపన్నుల్లో పలువురు పెద్ద ఎత్తున తమ సంపదను కోల్పోయారు. ప్రపంచ ధనవంతులలో మొదటి రెండు స్థానాల్లో ఉండే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లతో పాటు టాప్ టెన్‌లో ఉండే వారు భారీగా నష్టపోయారు. భారత కరెన్సీలో బెజోస్ రూ. 80 వేల కోట్లు నష్టపోగా, మస్క్ రూ. 70 వేల కోట్లు నష్టపోయారు. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ డేటా వెల్లడించింది. అమెరికా ద్రవ్యోల్బణం డేటా అంచనాల కంటే అధికంగా నమోదవడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. షేర్లు భారీగా పతనమవడంతో ఈ నష్టం అనివార్యమైంది. ఇది తొమ్మిదో అత్యంత దారుణ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మెటా అధినేత జుకర్ బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బాల్మెర్‌లు కూడా ఇదే బాటలో పయనించారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్ల మేర కోల్పోయారు. కాగా, అమెరికా వినియోగదారుల ధరల సూచీ గతేడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం 8.1 ఉండాల్సింది. అంచనాలు తప్పడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించారు. అటు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు కూడా కారణమయ్యాయి.