The worst thing behind the bike number of Udaipur Accused
mictv telugu

ఉదయ్‌పూర్ హంతకుల బైక్ నెంబరు వెనుక దారుణ విషయం.. అవాక్కయిన పోలీసులు

July 1, 2022

నుపుర్ శర్మకు మద్ధతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టాడని కన్హయ్యలాల్ అనే వ్యక్తికి ఇద్దరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య తరువాత వారు బైక్‌పై పారిపోతుండగా, ఉదయ్ పూర్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసులు వారిని పట్టుకున్నారు. తర్వాత వారికి పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని తెలియగా, అదే క్రమంలో వారి బైక్ నెంబరు గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులలో ఒకరైన రియాజ్ అత్తారి బైక్ నెంబరు rj 27 as 2611 కాగా, ముంబైపై దాడి జరిగిన రోజు 26/11 గుర్తుగా ఆ నెంబరును ఎంచుకోవడం గమనార్హం. ఈ నెంబరు కోసం ప్రత్యేకంగా రూ. 5 వేలు అధికంగా చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఆ బైకు ధన్ మండి పోలీస్ స్టేషనులో ఉంది. ఇంకా, రియాజ్ 2014లో నేపాల్ వెళ్లాడని, పాకిస్తాన్‌ కూడా వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నాడని, పాక్‌కు పలుమార్లు ఫోన్ చేశాడని అతని కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. కాగా, నిందితులిద్దరినీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయ్ పూర్‌లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇటు హత్యానంతరం ప్రభుత్వం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరోవైపు రియాజ్ ఉగ్ర శిక్షణ తీసుకున్న సంస్థ దావత్ ఇ ఇస్లామీ అనే సంస్థ పాక్‌లోని కరాచీలో ఉంది. దాని వ్యవస్థాపకుడి పేరు చివర అత్తారీ ఉండడం వలన అక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ కూడా తమ పేరు చివరన అత్తారీని పెట్టుకుంటారంట. ఆ క్రమంలోనే రియాజ్.. తన పేరును రియాజ్ అత్తారీ అని పెట్టుకున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది.