The young man who called the TRS MLA to resign, audio call has gone viral on social media
mictv telugu

‘మీరు రాజీనామా చేయండి సర్.. మేం గెలిపిస్తాం..’

November 21, 2022

రాష్ట్రంలో ఉపఎన్నిక వస్తేనే.. తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం ప్రస్తుతం చాలాచోట్ల ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్‌ను రాజీనామా చేయాలని కోరగా, తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేను ఓ యువకుడు రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్ చేశాడు. ఆ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆయనకు ఫోన్‌ చేసి ‘మీరు రాజీనామా చేయండి.. మునుగోడులో మాదిరిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.

దీనికి స్పందించిన సదరు ఎమ్మెల్యే ‘మునుగోడులో రాజీనామా చేసిన వ్యక్తి గెలిచాడా’ అని ప్రశ్నించారు. ‘నీది ఏ నియోజకవర్గం.. పది నిమిషాల్లో నీ దగ్గరికి మా వాళ్లు వస్తారు..’ అంటూ సమాధానమిచ్చారు. కాగా తమ ప్రజాప్రతినిధిని రాజీనామా చేయాలని ప్రశ్నించడంపై ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు సదరు యువకుడితో పాటు ఆయన స్నేహితుణ్ని స్టేషన్‌కు పిలిపించి మందలించినట్లు సమాచారం.