The younger brother gave 56 thousand rupees to his sister in khammam
mictv telugu

ఖమ్మం : రాఖీ కట్టిన అక్కకు డబ్బులతో తమ్ముడి తులాభారం

August 13, 2022

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య బంధాలను గుర్తు చేసే పండుగ రక్షాబంధన్. శుక్రవారం జరిగిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరూ కలిసి సంతోషంగా జరుపుకున్నారు. కొందరు జీవితాంతం గుర్తుండిపోయేలా తమ తమ ప్రత్యేకతలతో సోదరీమణులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులతో ఓ తమ్ముడు తన అక్కకు తులాభారం వేశాడు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌లో నివాసముండే బోలగాని బసవనారాయణ, అరుణ దంపతులకు రణశ్రీ, త్రివేదీ అనే ఇద్దరు పిల్లలు సంతానం. రణశ్రీకి గతేడాది వివాహం చేయగా, పెళ్లైన తర్వాత మొదటి రాఖీ పండుగ కావడంతో అక్కకు తన ప్రత్యేకత చూపాలని త్రివేదీ భావించాడు. అందుకు తన చిన్నతనం నుంచి దాచుకున్న డబ్బులను ఐదు రూపాయల బిళ్లలుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు. తన బంధుమిత్రలు, స్నేహితులు అందరినీ ఈ వేడుకకు ఆహ్వానించాడు. వారి సమక్షంలోనే తులాభారం వేయగా, ఇందుకు సుమారు 11,200 కాయిన్లు పట్టగా లెక్కెస్తే సుమారు 56 వేల రూపాయలుగా తేలింది. కాగా, తన కోసం తమ్ముడు తులాభారం వేయడంతో అక్క సంతోషంతో పొంగిపోయింది. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైనదని, జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.