ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఏ సినిమాకైనా టిక్కెట్ ధర 75 రూపాయలే
థియేటర్లలో అన్ని రకాల ధరలు పెరగడం వల్ల సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన ప్రేక్షకులను మళ్లీ రప్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. టాలీవుడ్ పెద్దలు ఇప్పటికే టిక్కెట్ల ధరలు తగ్గించి, స్నాక్స్ ధరలను సగటు ప్రేక్షకుడికి అందుబాటులోకి తెచ్చే విధంగా చర్చలు జరిపింది. మన వద్దే ఇలా ఉంటే ఉత్తరాదిన పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పలు కారణాల వల్ల అక్కడి థియేటర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కరోనా, పేలవమైన సినిమాలు, బాయ్ కాట్ బాలీవుడ్ నినాదాల వంటి వాటి వల్ల అక్కడి సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బ తిన్నది. ఈ పరిస్థితుల్లో సౌత్ నుంచి వెళ్లిన సినిమాలు బాగా ఆడి అక్కడి థియేటర్లకు మళ్లీ ఊపిరి పోశాయి. ఈ విషయాన్ని అక్కడి ఓనర్స్ ఆఫ్ థియేటర్స్ అసోసియేషన్ కూడా కొనియాడింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని ఏ సినిమాకైనా రూ. 75కే టిక్కెట్ అందించాలని నిర్ణయించింది. ఆ రోజు దేశంలోని దాదాపు నాలుగు వేల థియేటర్లు రూ. 75 కే టిక్కెట్లు అమ్ముతాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీ పాలిస్, కార్నివాల్, ఏషియన్, ముక్త, మూవీటైం, సిటీ ప్రైడ్ వంటి మల్టీప్లెక్సులు కూడా ఈ ఆదేశాలను పాటించనున్నాయి. ఈ ఆఫర్‌తో థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను మళ్లీ రప్పించి సానుకూల ఫలితాలు రాబట్టాలని యోచిస్తున్నాయి.