క్రైమ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ.. ఓ దోపిడీ ముఠా అచ్చం సినీ ఫక్కీలో బ్యాంకులోని నగదుని మాయం చేసింది. పక్క ప్లాన్ ప్రకారం, ఎవరూ లేని సమయంలో ఈ చోరీకి పాల్పడ్డారు దొంగలు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ రాబరీ కలకలం రేపింది. ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో చోరీ జరిగిన 36 గంటల వరకూ ఎవరికీ ఈ విషయం తెలియలేదు.
సోమవారం బ్యాంక్ తెరుద్దామని వచ్చిన సిబ్బంది ఇది చూసి షాక్ అయ్యారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లోని గ్రామీణ బ్యాంకులో దొంగలు.. రూ.7 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. బ్యాంకు పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. బ్యాంకు షట్టర్‌ను సినీ ఫక్కీలో గ్యాస్ కట్టర్లతో కట్ చేసి , ఆపై లోపలికి వెళ్లి , బ్యాంకులోని లాకర్లను సైతం గ్యాస్‌కట్టర్‌తో ధ్వంసం చేశారు. లాకర్లోని రూ.7లక్షల నగదు, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు సిబ్బంది అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.