ఏపీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండానే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండానే..

March 7, 2022

ap

ఆంధ్రప్రదేశ్‌‌లో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి సమావేశాలకు ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరుకాకపోవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ దాదాపు రెండున్నరేళ్లు అసెంబ్లీకి హాజరుకాలేదు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సభకు హాజరుకాలేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరై కాసేపటికే వాకౌట్‌ చేస్తూ బయటకు వెళ్లిపోయారు.

అప్పట్లో స్పీకర్ కోడెల వైఖరిని నిరసిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా అందరూ సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ హాజరు కాలేదు. ప్రజా సమస్యలపై తాము మాట్లాడుతుంటే, పదే పదే కట్ చేస్తుండడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీలోనే ప్రశ్నించారు. అంతేగాక సభకు నమస్కారం పెట్టి, వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాకుండా జనాల్లోకి వెళ్లారు. రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. తాజాగా చంద్రబాబు సైతం అసెంబ్లీలో తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారంటూ సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు మళ్లీ వస్తే సీఎంగానే సభలోకి అడుగుపెడతానంటూ సబతాం చేశారు.