అప్పుడు రెచ్చగొట్టారు.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడు రెచ్చగొట్టారు.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు: కేటీఆర్

April 9, 2022

bfbfnb

తెలంగాణలో బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరిని వేయించి, ఇప్పుడు యాసంగి ధాన్యాన్ని కొనమంటే కొనమని నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్ ట్విటర్ వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. ”యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని, కేసీఆర్ ముందే సూచించారు. అయినా, ఈ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే రాష్ట్రంలో వీరు, కేంద్రంలో వారూ నాటకాలు ఆడుతున్నారు” అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

అంతేకాకుండా ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రంమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

మరోపక్క శనివారం టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బ్రోకర్ల మాఫియాతో కేసీఆర్ కుమ్మక్కై భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు వ్యూహం పన్నారని మండిపడ్డారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే ధాన్యం విక్రయించేలా పథకం పన్ని.. రైతుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని.. కేసీఆర్ చేస్తున్న కుట్రతో రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.