దుబ్బాక ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతోంది. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగిసింది. దీంతో బరిలో దిగే ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలే కాకుండా ఇండిపెండెంట్, చిన్నా చితక పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. దుబ్బాకలో ఇప్పటివరకు మొత్తం 46 మంది నామినేషన్లు వేశారు. అందులో 12 నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఆ లిస్టులో కూడా మరో 11 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో మొత్తం 23 మంది ఫైనల్‌గా తేలారు. మరోపక్క ఇప్పటికే ప్రచారంలో నువ్వా?నేనా? అన్నట్టుగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను హరీశ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏ రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని హరీశ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎండమావుల లాంటివి అని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నాయి. ఇలా ఒక పార్టీ వారు మరో పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో దుబ్బాక ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. కాగా, నవంబర్ 3న దుబ్బాకలో పోలింగ్ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.