There are 4 thousand tigers on this earth..but he is only one: Taylor
mictv telugu

ఈ భూమిపై 4వేల పులులు ఉన్నాయి..కానీ,ఆయన ఒకే ఒక్కడు: టేలర్

August 14, 2022

న్యూజిలాండ్‌ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌..తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’లో టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ప్రపంచంలో మొత్తం నాలుగవేల పులులు ఉన్నాయని, అందులో తాను చూసిన పులుల్లో రాహుల్ ద్రావిడ్ ఒకరని పేర్కొన్నాడు.

”2011లో రాజస్థాన్ జట్టు ఆడినప్పటి సంగతులను ముందుగా తెలియజేస్తాను. రాహుల్‌ ద్రావిడ్ కూడా రాజస్థాన్‌ తరఫునే ఆడారు. ఆ సమయంలో పులులను చూసేందుకు మేము రణతంబోర్ జాతీయ పార్క్‌‌కు వెళ్లాము. అక్కడ భారత క్రికెటర్లకు ఉన్న క్రేజ్‌‌ను ప్రత్యక్షంగా చూసి, ఆశ్చర్యపోయాను. ఒకసారి ఏదో మాటల సందర్భంగా ఎన్నిసార్లు పులిని చూశారని రాహుల్‌ ద్రావిడ్‌ను అడిగాను. దానికి ఆయన.. 21సార్లు వెళ్లినా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారు.

ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి జాతీయ పార్క్‌కు వెళ్లాము. ఈసారి పులి కనిపించిందా అని నేను ఆయనను అడిగాను. దానికి రాహుల్.. 21సార్లు వెళ్లినా కనిపించని పులి..22వ సారి కనిపించిందని నాతో చెప్తూ, తెగ ఆనందపడ్డారు. మేము పులిని చూసేందుకు ఓపెన్ టాప్ ఉన్న జీప్‌లో ఎక్కాం. చాలా దగ్గరగా పులిని చూశాం. అయితే అంతకన్నా నన్ను మరో విషయం ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేసింది.

అది ఏమిటంటే..మేము పులిని చూస్తూంటే..పులులను చూడటానికి వచ్చిన జనమంతా ఆ పులిని వదిలేసి, రాహుల్ ద్రావిడ్‌ను చూడటం, ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. మేము పులిని చూసిన ఆనందం కంటే వారు రాహుల్ ద్రావిడ్‌ను చూసిన ఆనందమే ఎక్కువగా అనిపించింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో 4వేల పులులు ఉంటాయేమోగానీ..రాహుల్‌ ద్రావిడ్ మాత్రం ఒకే ఒక్కడు. అందుకే ఆయన పట్ల ఇంత క్రేజ్‌” అని రాస్‌ టేలర్ పేర్కొన్నారు.