there is a possibility of heavy rains in the state of Telangana for the next 3 days, says HMD
mictv telugu

తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు

July 17, 2022

రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అతి భారీవర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే కొనసాగుతుండగా తాజాగా వర్ష సూచనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా-పశ్చిమబెంగాల్‌ తీరంలో కొనసాగుతున్నదని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని తెలిపింది.

ఈ ప్రభావంతో తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. రేపు అనేక జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉందని .. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

మరోవైపు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సీఎం కేసీఆర్.. వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకునేందుకు తీసుకోనున్న చర్యలపై అధికారులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.