ఆర్టీసీ సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. అశ్వత్థామ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. అశ్వత్థామ రెడ్డి

October 24, 2019

There is no backward communication on the RTC strike

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు కేసీఆర్ అనడంతో ఆర్టీసీ కార్మికులలో ఆందోళన నెలకొంది. ఐదారు రోజుల్లో ఒక్క సంతకంతో నిర్ణయం తీసుకుంటానని.. యూనియన్ ఉచ్చులో పడి ఆర్టీసీ కార్మికులు మీ రక్తం మీరే పీల్చుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఘాటుగా స్పందించారు.

ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అని కేసీఆర్ చెప్పగా.. ఎవరు ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి పరాకాష్టగా నిలిచాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. యూనియన్ల వల్లే ఆర్టీసీ ఇంకా బతికి ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కష్టం అని.. కేసీఆర్ అయ్య జాగీరు కాదని స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులదే అంతిమ విజయమని, ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని.. ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశానని అన్నారు. ఆర్థిక మాంద్యం ఒక్క తెలంగాణలోనే కాదు ప్రపంచమంతటా ఉంది.. ధనిక రాష్టం అని చెప్పిన మూడు ఏళ్లలోనే నష్టాల్లోకి వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే అని.. ఈనెల 30న  సరూర్ నగర్‌లో నిర్వహించనున్న సకలజనుల సమరభేరీని విజయవంతం చేయాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. రేపు అన్ని పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు తమ సమస్యలు వివరిస్తామని తెలిపారు.