నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నడక శరీరానికే కాదు..గుండె ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని మరోసారి రుజువైంది. రోజూ 11 నిమిషాలపాటు నడవడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుందని చెబుతున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. నడక గుండె సంబంధించి జబ్బులు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందని వెల్లడించారు. ఈ మేరు వారి తాజా పరిశోధన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించారు.
వయస్సు మీదపడినవారు వారంలో కనీసం 150 నిమిషాలపాటు ,లేదంటే 75 నిమిషాలపాటు అత్యంత తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సిఫార్సు చేస్తోంది. అతిగా నడవాల్సిన అవసరం లేదని అందులో సగం చేసినా చాలు పది అకాల మరణాల్లో ఒకదానిని నివారించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అసలేనడవకపోవడం కంటే ఎంతోకొంత నడవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని యూనివర్సిటీ వైద్య పరిశోధన మండలి మహమ్మారుల విభాగానికి చెందిన డాక్టర్ సోరేన్ బ్రేజ్ అంటున్నారు. వారంలో 75నిమిషాలపాటు నడవడం వల్ల గుండె వ్యాధుల ముప్పు 17శాతం, క్యాన్సర్ల ముప్పు 7శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు.
గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. 2019లో సంవత్సరానికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమైంది, అయితే 2017లో 9.6 మిలియన్ల మంది క్యాన్సర్ తో మరణించారు.