హైదరాబాద్‌లో నీటి కొరత అబద్ధం.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో నీటి కొరత అబద్ధం.. కేటీఆర్

July 17, 2019

హైదరాబాద్‌లో నీటి కష్టాలు లేవని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మారుతి హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని ప్రశ్నించగా పైవిధంగా బదులిచ్చారు.  కేటీఆర్‌ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్‌ నీటి అవసరాలు కూడా తీరతాయని తెలిపారు. ఈ ట్వీట్‌కు మారుతి రిప్లై ఇచ్చారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేవలం 48 రోజులకు సరిపడే తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.

దీనిపై కేటీఆర్‌ స్పందించారు.. ‘అది కరెక్ట్ రిపోర్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభమైంది. మరికొద్ది వారాల్లోనే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటుంది. హైదరాబాద్‌కు 175 ఎంజీడీల నీరు అందనుంది. దీంతో తాగునీటి సమస్య అనేది వుండదు. అలాగే నీటి పొదుపు  ప్రాధాన్యత గురించి నగరవాసులు గుర్తించారు’ అని రిప్లై ఇచ్చారు. అనంతరం మారుతి శుభావార్త చెప్పారంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ ట్వీట్ కన్నా ముందు కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ‘ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరికి ఏ మాత్రం వరద రావడంలేదు. అయినా ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు నిల్వచేశాం. ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. వర్షాలు పడితే మోటార్లు మొదలవుతాయి. మోటార్లు అన్నీ ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై, ఇతర మెట్రోపాలిటన్‌ నగరాల్లో మాదిరి నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చు’ అని కేటీఆర్ తెలిపారు.