సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఇప్పటికీ వారంలో ఐదు రోజులు పని చేస్తే చాలు. అలాంటిది నాలుగు రోజులు చాలని కొన్ని కంపెనీలు భావించి ట్రయల్ రన్ కూడా చేశాయి. దీని ఫలితం ఆశాజనకంగా ఉండడంతో త్వరలోనే వారంలో నాలుగు రోజులు పని చేస్తే చాలంటున్నాయి.
ఇదంతా చూసి ఎక్కడా? ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదూ! అయితే ఈ ట్రయల్ రన్ యూకేలోని కొన్ని కంపెనీలు కలిసి చేశాయి. గత సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు 61 కంపెనీలు సుమారు 3,500మందితో వారంలో నాలుగు రోజుల పాటు పనిచేయించాయి. వాళ్లు కంప్రెస్డ్ వర్క్ వీక్ లో ఎలా పనిచేశారోనన్న దానిమీద అధ్యయనం చేశాయి. కంపెనీలే కాదు.. ఉద్యోగులు కూడా నాలుగు రోజుల పనిమీద సంతృప్తిగా ఉన్నారు. అయితే 92శాతం కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగించడానికి సుముఖంగా ఉన్నారు. 4 శాతం సంస్థలు సందిగ్ధంగా ఉండగా, 4శాతం కంపెనీలు తామ పాత పద్ధతినే కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
రెవెన్యూ పెరిగింది..
వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజినెస్ పర్ఫామెన్స్ కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. రెవెన్యూ కూడా 35శాతం పెరిగింది. గతంలో కూడా మైక్రోసాఫ్ట్, షేక్ షాక్ తో సహా యూఎస్ ఆధారిత కంపెనీలు కూడా నాలుగు రోజుల పని వారంలో విజయం సాధించాయి. 2019లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేసినప్పుడు ఉత్పాదకత 40శాతం పెరిగిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ట్రయల్ సమయంలో సగటున 1.4శాతం ఆదాయం పెరిగిందని కంపెనీలు కూడా చెబుతున్నాయి.
ఉద్యోగులు ఖుష్..
ఈ ట్రయల్ లో భాగంగా 62శాతం మహిళలు, 37శాతం మంది పురుషులు, ఒక శాతం ట్రాన్స్ వారు ఇందులో పాల్గొన్నారు. వారంలో నాలుగు రోజులు పనిచేయడం వల్ల వీరు సెలవులు తీసుకునే సంఖ్య తగ్గింది. అలాగే ఉద్యోగం వదిలేయాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు 57శాతం మంది తెలియచేశారు. అంతేకాదు.. ఐదు రోజుల పనిని నాలుగురోజుల్లోనే పూర్తి చేసి అంతే జీతం పొందినప్పుడు నాలుగు రోజులే హాయిగా ఉందని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది.
నిద్ర సమస్యలు..
కేవలం యూకే, యూఎస్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫలితాలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఈ పని వేళల వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గిందనే సమాచారం ఉంది. అవును.. 40కి బదులు 32 గంటలు పని చేయడం వల్ల మరింత హాయి నిద్ర పోతారని అంటున్నారు. ఇందులో కూడా 40శాతం మంది తక్కువ నిద్ర సమస్యలను ఎదుర్కొన్నారు. మరో 40శాతం మంది ఎలాంటి మార్పును చూడలేదు. అలాగే 20శాతం మంది మాత్రం పని ఒత్తిడి వల్ల నిద్ర సమస్యలు పెరిగినట్లు చెబుతున్నారు. వీటితో పాటు.. వాహనాల వినియోగం తగ్గుతుంది, కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ కాలం దొరికిందని ‘4డే వీక్ గ్లోబల్’ స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు ఎండీ చార్లోటె లాక్ హార్ట్ తెలిపారు. మరి మీరు ఎన్ని రోజులు పని చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు?!