ఇటీవల సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకుల్లో అమ్మాయిలే ఉన్నారు. నాలుగో ర్యాంకర్ ముందుగా అమ్మాయి అనుకున్నారు కానీ అబ్బాయని తేలింది. ఇకపోతే టాప్ 5 ర్యాంకర్లు సాధించిన మార్కులను యూపీఎస్పీ గురువారం విడుదల చేసింది. టాప్ 1లో నిలిచిన శ్రుతి శర్మ 54.56 శాతం మార్కులు సాధించింది.
రెండో ర్యాంకర్ అంకిత అగర్వాల్ 51.85 శాతంతో నిలిచింది. మొత్తంగా 2025 మార్కులకు పరీక్ష జరుగగా (మెయిన్స్, ఇంటర్య్వూలు కలిపి) తొలి ర్యాంకు శ్రుతి శర్మ 1105 మార్కులు సాధించింది. అందులో రాత పరీక్షలో 932 మార్కులు, ఇంటర్వ్యూలో 173 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ అంకిత్ అగర్వాల్ 1050 (రాత పరీక్ష 871, ఇంటర్వ్యూ 179), మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా 1045 (రాత పరీక్ష 858, ఇంటర్వ్యూ 187), నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ 1039 (రాత పరీక్ష 860, ఇంటర్వ్యూ 179), ఐదో ర్యాంకర్ ఉత్కర్ష్ ద్వివేది 1036 (రాత పరీక్ష 871, ఇంటర్వ్యూ 165) చొప్పున సాధించారు. కాగా మొత్తం దరఖాస్తులు 10,93,984 రాగా, ఇందులో పరీక్ష రాసిన వారు 5,08,619 మంది. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు 9214 మంది. వీరిలో పర్సనల్ ఇంటర్వ్యూకి 1821 మంది ఎంపికయ్యారు. చివరకు 685 మంది విజయం సాధించారు. ఇందులో జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ 73, ఒబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ 60 మంది ఉన్నారు.