యుద్ధంపై భారత్ తటస్థ వైఖరికి కారణాలివీ.. - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధంపై భారత్ తటస్థ వైఖరికి కారణాలివీ..

March 2, 2022

yyyy

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో చాలా దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడగా, చాలా తక్కువ దేశాలు రష్యాని సమర్థిస్తున్నాయి. కానీ, మనదేశం ఇరు పక్షాలకు దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంబించింది. కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని
ప్రవేశపెట్టగా.. భారత్ ఆ ఓటింగ్ కు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయింది. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన విశ్లేషకులు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేయడం రష్యాకు అనుకూలంగా వ్యవహరించడమేనని కొందరు తప్పు పడుతున్నారు. అయితే మెజారిటీ వ్యక్తులు మాత్రం భారత్ వైఖరిని సమర్థిస్తున్నారు. గతంలో రష్యా మన దేశానికి చేసిన మేలును గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన మూడు యుద్ధాల్లో రష్యా మనకు అండగా నిలబడింది. ఎన్నో సార్లు భారత్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను తన వీటో అధికారంతో తిరస్కరించింది. ఇదికాక, భారత్ ఆయుధపరంగా రష్యాపై ఆధారపడాల్సిన పరిస్థితి. త్రివిధ దళాల్లో దాదాపు 70 శాతం వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలే ఉన్నాయి.

ప్రపంచంలోనే వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణి, విమాన వాహక విధ్వంస నౌకలు, క్షిపణి నిరోధక వ్యవస్థ అయిన ఎస్ 400, అనేక యుద్ధ ట్యాంకులు, స్నిప్పర్ గన్స్, అంతరిక్ష ప్రయోగాలకు సాంకేతిక సహకారం వంటి ఎన్నో విషయాల్లో రష్యా భారత్ కు భారీ సహాయం చేస్తూ నమ్మదగ్గ మిత్రుడిగా నిలిచింది. అంతేకాక, ఇరు దేశాల మైత్రి కాలపరీక్షకి తట్టుకుని నిలబడింది. మరోవైపు చైనాతో సరిహద్దుల్లో జరుగుతున్న వివాదానికి సంబంధించి భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక రష్యా పోషించే పాత్ర వెలకట్టలేనిది. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే.. మన విద్యార్థులకు మెడిసిన్ విద్య, భారతీయ ఫార్మా కంపెనీలకు మంచి మార్కెట్, పొద్దుతిరుగుడు నూనె గింజల దిగుమతి వంటి అంశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవ్వరినీ నొప్పించకుండా తటస్థ వైఖరి తీసుకుంది.