బంగారం ధర పెరగడానికి ఇవే కారణాలు - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం ధర పెరగడానికి ఇవే కారణాలు

August 13, 2019

price of gold.

ఈ ఏడాది బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం 38 వేలకు పైగా పలుకుతోంది. ఏడాది చివరికి ఈ రేటు 40 వేలు దాటే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ 8 నెలల్లోనే బంగారం ధర 20 శాతం పెరిగింది. ఈ పరిస్థితి దేశీయ మార్కెట్లోనే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా నెలకొంది. ప్రపంచ మార్కెట్లో గత ఆరేళ్లలో లేని విధంగా ఈ ఏడాది బంగారం ధర అమాంతం పెరిగింది. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. అమెరికా, చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం బంగారం పెరుగుదలకు మొదటి కారణంగా వారు భావిస్తున్నారు. ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య మాటల యుద్దం రోజు రోజుకూ ముదరడం, ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా ఉండటంతో పాటు చర్చలు కూడా విఫలం అవ్వడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. 

అలాగే తన కరెన్సీ యెన్ ధరతో పోలిస్తే డాలర్ ధరను తగ్గించిన చైనా, కరెన్సీ మాయ చేస్తోంది. మరో కారణం ఏంటంటే, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినేసింది. బ్రిటన్ రెండేళ్లుగా దేశ ఆర్థిక రంగంలో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో యూరప్ దేశాల్లో ప్రపంచ కంపెనీల పెట్టుబడులు విపరీతంగా ఈ ఐదేళ్లలో తగ్గాయి. దీంతో పెట్టుబడికి అవకాశం ఉన్న బంగారాన్ని యూరప్ దేశాలు బ్యాంకుల్లో కుదవ పెట్టాయి. దీంతో బంగారం ధర ప్రపంచ మార్కెట్లో పరుగులు మొదలుపెట్టింది. ఇక మూడో కారణం ఏంటంటే, ఈ మూడేళ్ల కాలంలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ పరిస్థితి, దేశాల ఆర్థిక వ్యవస్థలను అర్థం చేసుకున్న ఈ బ్యాంకులు, టన్నుల కొద్దీ బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. 

2018లో 238 టన్నుల బంగారాన్ని కొనేసిన గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు, ఈ ఏడాది మొదట్లో 374 టన్నుల బంగారాన్ని, ద్వితీయార్థంలో 224.2 టన్నుల బంగారాన్ని కొనేశాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో బంగారం నిల్వలు తగ్గి రేటు పెరగడానికి కారణంగా మారాయి. ఈ అంశాలన్నీ మనదేశంలో బంగారం మార్కెట్ మీద విపరీతంగా ప్రభావితం చేశాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదలకు అడ్డులేకుండా పోతోంది. అంతేకాదు, మరో కారణం ఏంటంటే, మొన్నటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని పెంచేసింది. మొన్నటి దాకా 10 శాతం వుంది. దాన్ని ఇప్పుడు 12.5 శాతానికి పెంచేసింది. దీంతో దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమైంది. ఇదే సమయంలో గతంలో కొన్న బంగారాన్ని కూడా ఎక్కువ ధరకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు. అందుకే ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర రూ.40 వేలకు పైగా పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.