These are the reasons why BJP is fielding Jagdeep Dhankar
mictv telugu

బీజేపీ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను నిలబెట్టడానికి గల కారణాలు ఇవీ

July 17, 2022

ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్న జగ్‌దీప్ ధన్‌కర్‌ను ప్రకటించింది. ఆగస్టు 6న జరిగే ఓటింగులో ఈయన గెలుపు లాంఛనమే. అయితే ఏ పార్టీ అయినా తాను చేసే పని వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తుంది. అది రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును నిలబెట్టడంలో కనిపించింది. ఇక జగ్‌దీప్ ధన్‌కర్ వల్ల బీజేపీ ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

1. రైతు బిడ్డ : జగ్‌దీప్ రాజస్థాన్‌లోని జుంజును జిల్లా కితానా గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. ఈ విషయాన్ని అభ్యర్ధిగా ప్రకటించేటప్పుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. దేశ రెండో అత్యున్నత స్థానానికి రైతు బిడ్డను పంపడం ద్వారా తాము రైతులకు అనుకూలం అనే భావన ప్రజల్లో కల్పించడం బీజేపీ లక్ష్యం. మూడు సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చినప్పుడు దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వాటికి చెక్ పెట్టినట్టు ఆ పార్టీ భావిస్తోంది.

2. రాజ్యాంగ పరిజ్ఞానం : రాజ్యసభ చైర్మెన్‌గా కూడా వ్యవహరించే ఉపరాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తికి రాజ్యంగం గురించి పూర్తి అవగాహన ఉండడం అవసరం. జగదీప్ 1989లో జుంజును ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా పనిచేశారు. తర్వాత 1993లో ఎమ్మెల్యేగా రాజస్థాన్ అసెంబ్లీలో పలు కీలక కమిటీల్లో పనిచేసి అనుభవం సంపాదించారు. అంతేకాక, ఈయన రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. కాబట్టి చట్టం గురించి పూర్తిగా తెలుసు. ఈ విషయాన్ని కూడా ప్రధాని మోదీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

3. రాజకీయ, న్యాయ అనుభవం : ఇలాంటి అంశాల్లో కూడా బాగా అనుభవమున్న జగదీప్ వల్ల రాజ్యసభలో పెండింగులో ఉన్న 26 బిల్లులను పాస్ చేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ప్రతిపక్షాలు ఎక్కువ సంఖ్యలో ఉండే రాజ్యసభను నడపడంలో జగదీప్ సమర్ధవంతంగా పనిచేయగలరని ఆ పార్టీ నమ్ముతోంది.

4. కుల ప్రభావం : జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ ఓబీసీ కేటగిరీలో వస్తారు. తద్వారా ఈ పదవిని మొదటిసారి ఓబీసీ చేపట్టనుండడంతో ఆ వర్గాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుంది. అలాగే రాజస్థాన్, హర్యానాలో ఉన్న జాట్ సామాజిక వర్గం బీజేపీకి మరింత దగ్గరవుతుంది. 2013 వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న జాట్ సామాజిక వర్గం తర్వాత బీజేపీకి దగ్గరవడంతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. జాట్‌లు హర్యానాలో 25 – 28 శాతం ఉండి రాజకీయ ప్రభావాన్ని చాలా బలంగా చూపుతున్నారు. అలాగే రాజస్థాన్‌లో 10 శాతం ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు 2023, 2024లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. హర్యానాలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడంతో పాటు రాజస్థాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి తమ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి జగదీప్ కులం కీలక పాత్ర వహిస్తుంది.

ఇవికాక, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన అభ్యర్ధులను చూస్తే తమపై ఉన్న అగ్రవర్ణాల పార్టీ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం కనబడుతోంది. ఇటీవల కాలం వరకు బీజేపీని బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌, బనియాల పార్టీగా భావించేవారు. దీంతో కొన్ని వర్గాలకు బీజేపీ చేరువ కాలేకపోయింది. ఇప్పుడు వాటిని కూడా భర్తీ చేయడం వల్ల రాబోయే కాలంలో పార్టీకి మరింత ప్రయోజనం కలుగుతుంది.