మార్చి నెల అంటేనే స్టూడెంట్లకు ఎగ్జామ్స్ టైమ్. సినిమాలు ఎక్కువగా చూసేది యువతే కాబట్టి ఈ సమయంలో సినిమాలు హిట్టయినా, కలెక్షన్ల విషయంలో మాత్రం నెలాఖరు వరకూ వేచి చూడక తప్పదు. పరీక్షలు ఇంకా పూర్తికానందున, బాక్సాఫీస్ వద్ద క్రేజీ మూవీలు సందడి చేసేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో చిన్న సినిమాలన్నీ థియేటర్‌లకు క్యూ కడుతున్నాయి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.
థియేటర్‌లో అలరించబోయే సినిమాలు
• ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా శివశంకర్ దేవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సి.ఎస్.ఐ. సనాతన్’. హత్య కేసు పరిశోధన నేపథ్యంలో సాగే కథలో సీఎస్‌ఐ అధికారిగా ఆది సాయికుమార్… అలీ రెజా, నందినిరాయ్, తాకర్ పొన్నప్ప, మధుసూధన్, వాసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 10 థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
• కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరోహీరోయిన్లుగా రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాసరావు నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘వాడు ఎవడు’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఈ నెల పదవ తేదినే విడుదల కానుంది.
• సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా వస్తున్న చిత్రం ‘నేడే విడుదల’. రామ్‌రెడ్డి పన్నాల దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కూడా మార్చి 10న థియేటర్‌లలో విడుదల కానుంది.
• వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్యాక్సీ’. హరీష్ సజ్జా దర్శకుడు. హరిత సజ్జా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 10న విడుదల కానుంది.
• హాలీవుడ్ నుంచి యాక్షన్, అడ్వెంచర్ మూవీగా వస్తున్న చిత్రం ‘65’ కూడా శుక్రవారమే విడుదల కానుంది. ఆడమ్ డ్రైవర్, అరియానా గ్రీన్‌బ్లాట్, క్లో కోల్‌మన్ నటించిన ఈ చిత్రానికి స్కాట్ దర్శకుడు.
ఈ వారం ఓటీటీలో రాబోయే తెలుగు చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
వెంకటేష్ , రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ . ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు వెంకటేశ్, అటు రానాకు ఇదే తొలిసారి వెబ్‌సిరీస్.
దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’ (Anger Tales). ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే ప్లాట్‌ఫాం(ఓటీటీ)లో రన్ బేబీ రన్ (తెలుగు), సోనీ లివ్‌లో బ్యాడ్ ట్రిప్ (తెలుగు) సినిమాలు మార్చి 10 వ తేదీనే విడుదల కానున్నాయి.