మనలో చాలామందికి ఉదయం కాఫీ,టీ తాగనిది ఉండలేరు. కాఫీ కానీ టీ కాన్నీ తప్పకుండా తాగాల్సిందే. రోజూకు రెండు నుంచి మూడు సార్లు టీ తాగే అలవాటు చాలా మందికి ఉంది. మధ్యలో గెస్టులు వచ్చినా..ఖాళీ సమయం దొరికినా కాఫీ, టీ తాగాల్సిందే. ఈ రెండింటిలో కెఫీన్ ఉంటుంది. అయితే కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. కెఫీన్ మీకు తక్షణ శక్తిని అధిస్తుంది. చురుకుగా ఉంచుతుంది. కానీ మోతాదుకు మించి తాగినట్లయితే..శారీరక సమస్యలే కాదు..మానసిక సమస్యలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణుల. ఒక వేళ మీరు కాఫీ, టీ మానేయాలనుకున్న ఎలా మానేయాలో తెలియకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ వ్యసనం నుంచి సులభంగా బయటపడతారు.
మూలికా టీలు ప్రయత్నించండి
మూలికా టీలు , కెఫీన్ టీలకు మంచి ప్రత్యామ్నాయాలు. ఇందులో ఎన్నో రకాల రుచులు ఉంటాయి. హెర్బల్ టీలను వేడిగా లేదా చల్లార్చి కూడా తాగొచ్చు. హెర్బల్ టీలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చామంతి టీ, జింజర్ టీ, రోజ్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ ఇలా ఎన్నో రకాల టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిమ్మల్ని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అల్లం టీ జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది.
కంటినిండా నిద్రకు
శరీరానికి కావాల్సినంత నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఎన్ని పనులున్నా సరే కంటినిండా నిద్రమాత్రం తప్పనిసరి. కావాల్సినంత నిద్ర ఉంటేనే ఎనర్జిటిగ్గా, ఉత్సాహంగా ఏ పనినైనా చేయగలుగుతాం. కాఫీలు, టీలు ఎక్కువగా తాగితే నిద్ర కరువవుతుంది. ఎందుకంటే కెఫీన్ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ వ్యసనం నుంచి బయటపడాలంటే…తగినంత నిద్ర అవసరం. నిద్ర మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుంతుంది.
ఇతర పానీయాలు
కాఫీ, టీకీ బదులుగా ఇతర పానీయాలను తీసుకునేలా చూడండి. హాట్ చాక్లెట్, ఆపిల్ సైడర్ వెనిగర్, మసాలా చాయ్ అన్నీ కూడా కెఫీన్ కు గొప్ప ప్రత్యామ్నాయ పానీయాలు. వీటిని ఆరోగ్యకరమైన పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
పోషకాహారం
మన ఆరోగ్యానికి పోషకాహారం చాలా అవసరం. పోషకాహారం అందిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ప్రతిరోజు భోజనంలో ముఖ్యమైన పోషకాలు ఉండేలా చేసుకోవాలి. ఇవి మీ శక్తిస్థాయిలను పెంచుతాయి. కెఫీన్, టీ వినియోగాన్ని నివారించడానికి కూడా చాలా సహాయపడుతుంది.
టీ, కాఫీ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి?
టీ, కాఫీ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడటం అనుకున్నంత సులభం కాదు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదీ ఏదీ లేదు. కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఆహారాలతో భర్తీ చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, శక్తిస్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే గుండెసంబంధిత వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను పెంచుతాయి.