ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వీళ్లు మాత్రమే అర్హులు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వీళ్లు మాత్రమే అర్హులు..

April 26, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ సోమవారం తీపికబురు చెప్పింది. కేసీఆర్ మార్చి 9వ తేదీన అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేసిన రోజు నుంచి నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లశాఖలో 16,614 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? ఫీజు ఎంత? ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి?  అనే విషయాలను అధికారులు విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. ఆ వివరాలు మీ కోసం..

1. ఎస్‌ఐ పోస్టులకు..
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు. దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం డిగ్రీ అర్హత ఉండాలి.

2. కానిస్టేబుల్, ఫైర్మెన్, వార్డర్ ఉద్యోగాలకు..
2022 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే కనీసం 18 ఏళ్ల వయసు నిండి, 40 ఏళ్లు దాటకుండా ఉండాలి. మహిళా కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), మహిళా వార్డర్లకు మరికొన్ని మినహాయింపులిచ్చారు. వితంతువులు, చట్టపరంగా భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లు మించకుండా ఉండాలి. మిగతా కులాల్లో 18-35 మధ్య వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ చదివి ఉండాలి.

3. ఎస్‌ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలకు..
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

4. పోలీసు ట్రాన్స్పర్ట్సు ఆర్గనైజేషన్‌లో ఎస్‌ఐ ఉద్యోగాలకు..
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తత్సమానమైన విద్యా సంస్థ నుంచి డిప్లొమా పొంది ఉండాలి.

5. ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్‌ఐ ఉద్యోగాలకు..
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు మించకుండా ఉండాలి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

6. దరఖాస్తు ఫీజు ఎంత?
ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.1,000, ఎస్సీ, ఎస్టీలైతే రూ. 500, స్థానికేతరులైతే కులాలతో సంబంధం లేకుండా రూ.1,000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పోలీసు ఉద్యోగాలన్నిటికీ ప్రభుత్వం 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. అన్ని ఉద్యోగాలకు 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎస్‌ఐతోపాటు స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500, స్థానికేతరులైతే అన్ని కేటగిరీలవారూ రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్థానికులైతే రూ. 800, ఎస్సీ, ఎస్టీలయితే రూ. 400, స్థానికేతరుతైలే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ. 800 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలని అధికారులు తెలిపారు.