Thief dances after stealing goods worth lakhs in MP's Shivpuri
mictv telugu

దొంగతనం చేసిన ఆనందంలో నాగిన్ డాన్స్.. కెమెరా చూసి షాక్

January 6, 2023

దొంగతనం చేసే వ్యక్తులది ఓ డిఫరెంట్ స్టైల్. రెక్కీ నిర్వహించి, పక్కా ప్లాన్ వేసి, టార్గెట్‌ను కొల్లగొట్టి… కామ్ గా పని కానిచ్చేస్తారు. వీళ్లల్లో కూడా ఎన్నో రకాలు.. కొందరు రాత్రివేళ, జన సంచారం లేని చోట చోరకళను ప్రదర్శిస్తే.. మరికొందరు జనం రద్దీగా ఉన్నచోటే చేతులకు పని చెబుతారు. మొత్తానికి సైలెంట్‌గా పని చేయడం కామన్. కానీ, మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ వ్యక్తి మాత్రం.. దొంగతనం చేశాక అక్కడి నుంచి కదలకుండా, అదేదో ఘనకార్యం చేసినట్లు డ్యాన్స్ చేశాడు. నగదు, ల్యాప్‌టాప్, లక్షల రూపాయల విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని.. బయలుదేరి టైంలో అంతులేని ఆనందమొచ్చి.. డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.

బుధవారం శివపురిలోని ఖనియంధన పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు షాపుల్లో చోరీలు జరిగాయి. వాటిలో వికాస్ జైన్ అనే వ్యక్తి షాప్ కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం షాప్ మూసేసి ఇంటికెళ్లిన వికాస్ జైన్ … ఆ తర్వాతి రోజు ఉదయం షాపుకి వచ్చేసరికి షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. కంగారుపడుతూ లోపలికి వెళ్లి చూడగా ల్యాప్‌టాప్, నగదు, కొన్ని పత్రాలు, ఇతర వస్తువులు కనిపించలేదు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాప్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. దొంగతనం తర్వాత నిందితుడు బ్లాక్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. కానీ, షాప్‌లో కెమెరాను గమనించిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డ్యాన్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సదరు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.