Thief Died In Watchman Attack in Hyderabad Kushaiguda Venkateswaraswamy Temple
mictv telugu

గుడిలో చోరికి వచ్చి వాచ్‌మెన్‌తో ఘర్షణ.. యువకుడు మృతి

February 22, 2023

Thief Died In Watchman Attack in Hyderabad Kushaiguda Venkateswaraswamy Temple

హైదరాబాద్‌ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన దొంగ.. అక్కడున్న వాచ్‌మెన్‌తో ఘర్షణకు దిగిన సమయంలో అనుకోకుండా చనిపోయాడు. అసలేం జరిగిందంటే.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్ డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలో చోరి నిమిత్తం వచ్చాడు.

గుడిలోకి వచ్చిన యువకుడు నేరుగా హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టే పనిలో పడ్డాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సదరు యువకుడికి, రంగయ్యకు మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దొంగను అడ్డుకునేందుకు వాచ్‌మెన్‌ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై నెత్తుటి మడుగులో నేలకొరిగి అలాగే మరణించాడు. వెంటనే రంగయ్య పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు వచ్చి మృతుడిని క్షుణ్ణంగా పరిశీలించగా.. వారికి అతని ఫోన్ దొరికింది. ఫోన్‌లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా పోలీసులు గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.