చోరీకెళ్లి నిద్రపోయిన దొంగ.. కర్రతో కొట్టి లేపితేగాని.. - MicTv.in - Telugu News
mictv telugu

చోరీకెళ్లి నిద్రపోయిన దొంగ.. కర్రతో కొట్టి లేపితేగాని..

February 27, 2020

Thief.

దొంగతనానికి వెళ్లిన దొంగలకు ఎంత టెన్షన్ ఉంటుంది? దోచుకున్న సొమ్ముతో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవరి కంటా పడకుండా ఎస్కేప్ అవాలని చూస్తారు. కానీ ఈ దొంగ మాత్రం అందుకు విరుద్ధంగా చాలా తీరుబడిగా దొంగతనం చేసి అదే ఇంట్లో పడుకున్నాడు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉల్లాస్ జంక్షన్ వద్ద ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. ఇంటి పైకప్పు తొలగించి లోపలికి వెళ్లాడు. టీవీ స్టాండ్ పక్కన పెట్టిన తాళాలను తీసుకుని చోరీకి ప్రయత్నించాడు. అంతలోనే అతనికి నిద్ర ముంచెత్తుకొచ్చింది.

ముందు నిద్ర తర్వాతే దొంగతనం అని భావించినట్టున్నాడు.. అంతే సోఫాలో కూలబడి హాయిగా నిద్రపోయాడు. బుధవారం ఉదయం ఇంటి పైకప్పు తొలగించి ఉండడం చూసిన యజమాని సుదర్శన్‌ షాక్ అయ్యాడు. గదిలో చూస్తే చక్కగా సోఫాలో గుర్తు తెలియని ఓ వ్యక్తి పడుకోవడం చూసి మరింత షాక్ అయ్యాడు. అతను కచ్చితంగా దొంగే అని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం సుదర్శన్ అతడిని కర్రతో కొట్టి లేపాడు. పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అతగాడిని బీహార్‌ వాసి అనిల్ సహానీగా గుర్తించారు. అతను మద్యం మత్తులోనే దొంగతనానికి పాల్పడ్డాడని.. అందుకే మత్తు ఎక్కి నిద్రపోయాడని పోలీసులు తెలిపారు.