పోనీలే పాపం అని ఓ దొంగ మీద కోర్టు కనికరం చూపి బెయిల్ ఇచ్చింది. అంతే ఆ మరుక్షణమే సదరు దొంగ తన బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఏకంగా కోర్టు ఆవరణలో ఉన్న బైకునే ఎత్తుకెళ్లి సంచలనం సృష్టించాడు. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. కరాచీలోని సింధ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా అతను విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యాడు. పలుమార్లు విచారించిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతను వెళ్లి బుద్ధిగా ఏదైనా పని చేసుకుని బతికేస్తాడని కోర్టు భావించింది. కానీ, వారి అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసి అతను కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైకును ఎత్తుకెళ్లిపోయాడు.
వారినీ బడవా.. నీకు జైలే కరెక్ట్ అని భావించిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు ఆ విధంగా కృతజ్ఞతలు తెలిపాడు’ అని ఓ నెటిజన్ నవ్వుల ఎమోజీని పంచుకున్నాడు. ‘బుద్ధి పోనిచ్చుకోని దొంగ అంటే ఇతనే’ అని మరో నెటిజన్ నవ్వుకున్నాడు.