ఆకలి అతని చేత దొంగతనం చేయించింది. ఓ సూపర్ మార్కెట్లోకి దూరిన దొంగ చేతుల్లో అమరినకాడికి దోపిడీ చేశాడు. అనంతరం తాను చెడ్డ దొంగను కాను.. మంచి దొంగనని ఓ లేఖ రాసి అందులో వదిలి వెళ్లాడు. కూడని పరిస్థితుల్లో తాను దొంగతన చేయాల్సి వచ్చిందని.. తనను మన్నించమని వేడుకున్నాడు. ఆ లేఖను చూసి సూపర్ మార్కెట్ యజమాని కళ్లు బైర్లు కమ్మాయి. అతను ఎంత లేఖ రాసినా.. అతన్ని క్షమించి తాను వేలల్లో నష్టపోలేడు కదా. చక్కగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆశ్చర్యకర ఘటన చెన్నైలోని ఉసిలంపట్టిలో మదురై రోడ్డు వెంబడి ఉన్న ఒక సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. ఆరోజు ఉదయాన్నే షాపు తెరిచిన యజమాని షాక్ అయ్యాడు. పైన సీలింగ్‌కు రంధ్రం చేసి ఉంది. సామన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. కొన్ని వస్తువులు మాయం అయ్యాయి. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దుకాణంలో నుంచి రూ.65 వేల విలువైన రెండు కంప్యూటర్లు, ఒక టెలివిజన్ సెట్‌తో పాటు రూ.5 వేల నగదును దొంగ దోచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ షాపులోనే వారికి ఓ లేఖ కనిపించింది. దాన్ని తీసి చదవగా.. అది దొంగ రాసిన లేఖ అని గుర్తించారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘నన్ను క్షమించండి. నేను ఆకలితో ఉండి ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ఈ దొంగతనంతో మీరు ఒక రోజు ఆదాయాన్ని మాత్రమే కోల్పోయారు. కానీ ఇది నా మూడు, నాలుగు నెలల ఆదాయానికి సమానం. మరోసారి నన్ను క్షమించమని కోరుతున్నాను’ అని సదరు దొంగ లేఖలో ధీనంగా పేర్కొన్నాడు. అదంతా విని సూపర్ మార్కెట్ యజమాని రాంప్రాకాష్ షాక్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, దొంగలు ఇండ్లల్లోకి ప్రవేశించి వస్తువులను ఎత్తుకెళ్తూ క్షమాపణ లేఖలు రాస్తున్న ఘటనలు ఇప్పటికే కొన్ని జరిగిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో చాలామంది ఉపాధి కోల్పోవడంతో దొంగతనాలకు ఎగబడ్డారు. బిహార్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఓ వలస కార్మికుడు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఓ ఇంటి నుంచి సైకిల్ దొంగతనం చేసి క్షమించమంటూ లేఖ వదిలి వెళ్లాడు.