Thief Returns Money Stolen From A House With Apology Letter In Srikakulam District
mictv telugu

అన్నావదినలకు సారీ.. లెటర్ రాసిన దొంగ

July 29, 2022

ఆశ పుట్టి చేశాడో, అవసరమే ఉండి చేశాడో కానీ మొత్తానికి దొంగతనం చేశాడా వ్యక్తి. విచిత్రమేంటంటే.. చోరీ చేసిన తర్వాతి రోజు రాత్రి మళ్లీ ఆ ఇంటికి వచ్చాడు. యథాస్థానంలో డబ్బులు ఉంచాడు. తప్పు చేశానంటూ ఓ లేఖ కూడా పెట్టేసి పోయాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని కొల్లివలసలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజ్జిపురపు చక్రధరరావు కుటుంబంతో కలిసి ఆదివారం బంధువుల ఊరికి వెళ్లాడు.

అదేరోజు రాత్రి ఆ ఇంట్లో చోరీ జరిగింది. చక్రధరరావు సోమవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి కనిపించాయి. బీరువాలో ఉన్న నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి చక్రధరరావు కుటుంబం మేడపైన పడుకుంది. మంగళవారం తెల్లారాక కిందకు వచ్చి చూసేసరికి తాళం తొలగించి ఉంది. బీరువాలో యథాస్థానంలో రూ.11.20 లక్షల డబ్బులు కనిపించాయి. అక్కడే ఓ లేఖ కూడా కనిపించింది. అందులో ‘సారీ అన్నయ్య.. సారీ వదిన.. తప్పు చేశాను. క్షమించండి, నన్ను పట్టుకుంటే సూసైడే శరణ్యం’ అని రాసి ఉంది.

ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, దొంగ కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ కృష్ణకాంత్‌ తెలిపారు. ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనే అని భావిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.