చోరీ చేయడానికి వచ్చిన ఓ దొంగ దాన్ని సక్సెస్ ఫుల్ గా చేశాడు. కానీ, అదే ఇంట్లో రోజంతా నిద్రపోయి యజమానికి అడ్డంగా దొరికేశాడు. ఆగ్రహించిన యజమాని కొట్టి కట్టేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బాచుపల్లి శంకర్ అనే దొంగ బంజ హన్మంతప్ప ఇంట్లో దొంగతనానికి శనివారం రాత్రి వెళ్లాడు. ఇంట్లోకి దూరి చాకచక్యంగా వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు కానీ, డిసెంబర్ 31 కావడంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానించే ప్రయత్నంలో మద్యం బాగా తాగేశాడు. మత్తు దిగకపోవడంతో అదే ఇంట్లో ఉన్న పత్తిపై మొత్తగా ఉంటుందని హాయిగా నిద్రపోయాడు. దొంగను గమనించని యజమాని ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్లిపోయారు. అయినా మత్తు వదలని దొంగగారు ఆదివారం సాయంత్రం వరకు అలాగే పడుకుండిపోయాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన యజమాని పారిపోయే ప్రయత్నం చేసిన దొంగను గమనించి పట్టుకున్నాడు. గుంజకు కట్టేసి గట్టిగా నిలదీస్తే చోరీ విషయాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి కమ్మలు, మెట్టెలు, ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమివ్వగా వారి విచారణలో శంకర్ పై అప్పటికే రెండు కేసులు ఉన్నాయని తేలింది. చివరకి హన్మంతప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
శ్రీలంకతో తొలి టీ20కి కొత్త ఓపెనర్.. అక్తర్ రికార్డుపై కన్నేసిన పేసర్
ఎక్స్‌బీబీ 1.5 వేరియంట్.. సోకితే నూకలు చెల్లినట్టే…
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు మరోసారి చుక్కెదురు