Thief who stole Rs. 4 crore jewellery.. Thief caught with Rs. 100
mictv telugu

రూ.4 కోట్ల ఆభరణాలు చోరీ..రూ.100తో దొరికిపోయిన దొంగ

September 1, 2022

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. నలుగురు దొంగలు 15 రోజులుగా రెక్కీ నిర్వహించి, బుధవారం తెల్లవారుజామున 4-5 గంటల మధ్య పోలీసులమని బెదిరించి, రూ.4 కోట్ల విలువైన ఆభరణాల కన్‌సైన్‌మెంట్‌ను తీసుకొని పారిపోయారు. అప్రమత్తమైన కొరియర్ కంపెనీ యాజమాన్యం..పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దొంగలను ఒక్క రూ.100 పేటీఎం ట్రాన్సక్షన్‌ సహాయంతో పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ఏరియాలో ప్రయివేట్ కొరియర్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ..ఖరీదైన ఆభరణాలు, విలువైన వస్తువులను దేశంలోని నలుమూలలకు కొరియర్ చేస్తుంటుంది. ఒక్కోసారి కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను సైతం ఒక చోటు నుంచి మరోచోటుకు రవాణా చేస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న నలుగురు దుండగులు..బుధవారం తెల్లవారుజామున 4-5 గంటల మధ్య పహర్‌గంజ్ వెళ్లారు. చంఢీగఢ్, లుధియానాకు కన్‌సైన్‌మెంట్ పంపించేందుకు కొరియర్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు ఆఫీసు నుంచి బయటకు రాగా.. మేము పోలీసులమంటూ, వారిని బెదిరించారు. ఆ దుండగుల్లో ఒకరు పోలీసు యూనిఫాం ధరించారు. అతడు ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడుతుండగా, మరో ఇద్దరు వారి కళ్లలో కారం చల్లారు. కాసేపట్లోనే రూ.4 కోట్ల విలువైన ఆభరణాల కన్‌సైన్‌మెంట్‌ను తీసుకొని, పారిపోయారు” అని వెల్లడించారు.

అనంతరం పోలీసులు..ఆ ఏరియాలో ఉన్న 200 సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోలో నిందితుల్లో ఒకరు సమీపంలోని టీ స్టాల్‌లో టీ తాగినట్లు గుర్తించారు. అతడు ఓ క్యాబ్ డ్రైవర్‌ను ఆపి మాట్లాడి, అతడి దగ్గర్నుంచి డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు. టీ స్టాల్ యజమాని ద్వారా క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కనుగొన్నారు. అతణ్ని ప్రశ్నించగా..నిందితుడు తనకు రూ.100 పేటీఎం చేశాడని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. దాంతో పేటీఎం ట్రాన్సాక్షన్ ఆధారంగా పేటీఎం ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు సంప్రదించి, అతడి ఫోన్ నంబర్‌ను గుర్తించారు. దీంతో కేసులో ప్రధాన చిక్కుముడి వీడింది. నిందితుణ్ని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు.