నోట్లు వదలి చిల్లర ఎత్తుకుపోయారు.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్లు వదలి చిల్లర ఎత్తుకుపోయారు..

August 24, 2017

దోచుకోవడానికి బ్యాంకుల్లో చొరబడే దొంగలు ఏం చేస్తారు? లాకర్లు తెరిచి కరెన్సీ కట్టలు, బంగారాన్ని ఎత్తుకుపోతారు.. కానీ మంగళవారం ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని సిండికేట్ బ్యాంకులో పడిన దొంగలు మాత్రం చిల్లర ఎత్తుకుపోయారు. కళ్ల ముందు కరెన్సీ కట్టలు కనిపిస్తున్నా వాటికి జోలికి పోకుండా రూ. 2.3 లక్షల విలువైన నాణేలను దోచుకుపోయారు. వీటిని 42 ప్లాస్టిక్ కవర్లలో వేసుకుని ఉడాయించారు. వీటిలో రూ. 5, రూ. 10 కాయిన్లు ఎక్కువగా ఉన్నాయి.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 12 గంటల్లోనే దొంగలను పట్టుకున్నారు. చిల్లర మాత్రమే ఎందుకు ఎత్తుకుపోయారని చోరశిఖామణులను విచారించగా వింత సమాధానం చెప్పారు. రూ. 2 వేల వంటి పెద్ద నోట్లను దొంగిలిస్తే వాటిలో జీపీఎస్ చిప్ ఉంటుంది కనుక తర్వాత సులువుగా దొరికిపోతామని, అందుకే చిల్లరను లూటీ చేశామని తెలిపారు. దీంతో పోలీసులు అవాక్కయారు. నిజానికి ఈ నోట్లలో చిప్ వంటివేమీ ఉండవు. మొత్తానికి బ్యాంకు రంధ్రం వేసి, గ్రిల్ తొలగించిన పడిన కష్టమంతా చిప్ భయంతో బూడిదలో పోసిన పన్నీరైపోయింది..