Thieves returning stolen idols for fear of nightmares
mictv telugu

పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాల అప్పగింత

May 16, 2022

Thieves returning stolen idols for fear of nightmares

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో దేవుని విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. వాటిని తమ వద్ద కొద్ది రోజులు ఉంచుకున్నందుకు నిద్రలో పీడకలలు వస్తున్నాయని విగ్రహాలను తిరిగిచ్చేశారు. చిత్రకూట్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తరౌన్హాలో ఉన్న ఓ పురాతన బాలాజీ ఆలయం నుంచి మే 9వ తేదీన కోట్ల రూపాయలు విలువ చేసే 16 అష్టధాతు విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. గమనించిన ఆలయ పూజారి వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టుగా కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో ఓ వారం రోజులు గడిచాయి. ఉన్నట్టుండి ఆదివారం తన ఇంటి పక్కన ఓ గోనెసంచి ఉండడం పూజారి గమనించాడు. తెరచి చూడగా చోరీకి గురైన 16 విగ్రహాలలో 14 విగ్రహాలు సంచిలో ఉన్నాయి. విగ్రహాలతో పాటు ఓ లెటర్ కూడా అందులో ఉంది. దాన్ని తెరచి చూడగా ‘విగ్రహాలను దొంగిలించిన తర్వాత రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. బలవంగంగా కన్ను మూసినా పీడకలలు వస్తున్నాయి. అందుకే భయపడి విగ్రహాలను తిరిగి అప్పగిస్తున్నాము’ అని రాసి ఉంది. కాగా, ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. మరి వాటిని తిరిగి ఇస్తారా? లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే లెటర్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.