ఆలయాల్లో దొంగతనాలు చేసే వాళ్లకి దేవుడంటే భయం ఉండదు అందుకే ఇలా చేస్తారు అనుకుంటాం. కానీ ఈ దొంగలకి మాత్రం అమ్మవారు అంటే చాలా భయం. అయినా సరే ఆలయంలో దొంగతనం చేయాలనుకున్నారు. తాము చేపట్టబోయే కార్యాన్ని ఆశీస్సులు కావాలని, చేస్తున్న పనికి క్షమాపణలు అడిగి మరీ వేడుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని మా కాళీ మహాదేవ్ జీ అక్షయ్ మందిర్లో ఈ చోరీ జరిగింది.
సోమవారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. వారు దొంగతనం చేసిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. దొంగలు ముందుగా కాళీమాతకు దండం పెట్టుకుని.. క్షమించమని మొక్కి మరీ దొంగతనం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత హుండీలోంచి డబ్బు, వస్తువులు చోరీ చేశారు. దొంగలు గుడి తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నాలుగు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, ఓ నెక్లెస్, రూ.వెయ్యి నగదు మాయం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు.