డబ్బులు ఉన్నా ఉల్లి మాత్రమే చోరి - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బులు ఉన్నా ఉల్లి మాత్రమే చోరి

November 28, 2019

ఉల్లి కంటతడి పెట్టిస్తోంది. కోస్తునప్పుడు మాత్రమే కాదు కొంటునప్పుడు కూడా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి. తాజాగా ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ దొంగతనం ఉల్లి ధరలకు అద్దం పడుతోంది. అక్షయ్ దాస్ అనే వ్యక్తి తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహతా ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం షాపు తెరవగానే షాకయ్యాడు. 

షాపులో దాదాపు రూ.50 వేల విలువైన ఉల్లిపాయలను దొంగలు ఎత్తుకుపోయారు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో షాపులో దొంగతనం అతడు నిర్ధరించుకున్నాడు. వెంటనే గల్లా పెట్టె తెరిచి చూశాడు. అందులో ఒక్క పైసా కూడా పోకపోవడంతో అతడికి ఆశ్చర్యమేసింది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 100 రూపాయలకు చేరుకోవడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. మరి దొంగలు కూడా డబ్బుల కంటే ఉల్లిపాయలే బెటరనుకుని వాటిని ఎత్తికెళ్లిపోయారని అనుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.