Things that son-in-law should not do in mother-in-law's house
mictv telugu

అత్తారింటికి వెళ్తున్నారా.. అల్లుడిగా చేయకూడని పనులేంటో తెలుసుకోండి

January 6, 2023

కోడలు అత్తారింటికి వెళ్లడం కామన్. కానీ అల్లుడు అత్తారింటికి వెళ్లడం కొంత స్పెషల్ అని చెప్పాలి. అల్లుడు రాగానే ఆ ఇంట్లో ప్రత్యేక మర్యాదలు ఉంటాయి. ఇంట్లోని వారందరూ పనిగట్టుకొని ఆప్యాయత చూపిస్తారు. అదంతా నిజం, శాశ్వతమనుకొని కొందరు చేయకూడని పనులు చేస్తారు. తమ పరిమితి ఏంటో తెలుసుకోకుండా అత్తారింటి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో సామాజిక విశ్లేషకులు అల్లుళ్లకు అత్తవారింట్లో చేయకూడని పనులేంటో సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకొని మసలుకుంటే అల్లుడిగా మంచి మార్కులు కొట్టేయవచ్చు.
1. ఎవరింటికైనా అతిథులు వస్తే వర్తించే నియమాలే అల్లుడికి కూడా వర్తిస్తాయి. ఏదో ఓ రెండ్రోజులు ఉంటాం, తర్వాత వెళ్లిపోతాం అనే ధోరణిలోనే అల్లుళ్లు ఉండాలి.
2. ఇల్లరికపు అల్లుడు కాకుంటే చుట్టపు చూపుగా మాత్రమే అత్తారింటికి వెళ్లాలి. అప్పుడే అతనికి విలువ, మర్యాద ఎక్కువగా ఉంటుంది.
3. ఎంత దూరం నుంచి వస్తే అంత విలువ, ఎంత బెట్టు చేస్తే అంత స్థాయిలో చూస్తారన్న సంగతి మరవద్దు.
4. అత్తారింటికి వెళ్లిన అల్లుడు అనవసరంగా వారి ఇంటి విషయాల్లో తలదూర్చకూడదు. అడిగేంత వరకు సలహాలు ఇవ్వకపోవడం మంచిది.
5. ఎంత దగ్గరి సంబంధం అయినా ఎంత మంచిగా చూసినా పండుగలు, శుభ కార్యాలకు ఓ నాలుగు రోజులు మహా అయితే వారం రోజులు అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే చులకన అయిపోతారు.
6. అత్తారింట్లో ఉన్నప్పుడు భార్య మీద అస్సలు విసుక్కోకూడదు. అలా చేస్తే ఎప్పుడూ అలాగే ఉంటారని అనుకుంటారు కాబట్టి జాగ్రత్తగా మసలండి.
7. మరదలు, బావమరుదులు ఉంటే వారితో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందరూ ఆనందిస్తారు. కానీ మోతాదు మించితే పైకి చెప్పకపోయినా లోలోపల బాధపడతారు. కాబట్టి మరదలితో సరసాలు, బావమరిది కాబట్టి ఇష్టం వచ్చినట్టు సంబోధించడం వంటివి చేయకండి. దీని వల్ల మీ వ్యక్తిత్వం పలుచన అయిపోతుంది.
8. మరీ ముఖ్యంగా అత్తారింటి డబ్బు విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు.
9. అత్తగారి వంటలకు వంక పెట్టకూడదు.
10. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చిన్న చూపు చూడకూడదు.
11. అల్లుడిని కదా అని బడాయిలకు పోకూడదు. అది కావాలి ఇది కావాలి అని అత్తారింటి స్థాయికి మించిన కోరికలు కోరకూడదు.
12. మన సమాజంలో అమ్మాయిని బాగా చూసుకొని గంభీరంగా ఉండే అల్లుళ్లకి మంచి విలువ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు హుందాగా ఉండేందుకు ప్రయత్నించండి.
ఇవన్నీ సాధారణమైన సూచనలు. నిజ జీవితంలో వారి వారి అనుబంధాన్ని బట్టి సంబంధాలు ఉంటాయి. ఏది ఏమైనా పైవాటితో మేలు జరుగుతుంది తప్ప నష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని మానవ సంబంధాల నిపుణులు చెప్పే మాట. ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి.